
మాస్ మహారాజ రవితేజ జోరు పెంచాడు. ఏడాదికి నాలుగు సినిమాలు చేసే రవితేజ గడిచిన రెండేళ్లలో కేవలం ఒక్కో సినిమాలో మాత్రమే నటించాడు. 2013లో ‘బలుపు’, 2014లో ‘పవర్’ సినిమాలతో గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. ఈ ఏడాది కాస్త జోరు పెంచి రెండు సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుట్టినరోజు కానుకగా ‘కిక్ 2’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి అభిమానులను ఖుషి చేశాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే ‘బెంగాల్ టైగర్’ షూటింగ్ స్టార్ చేయనున్నాడు.
సంపత్ నంది దర్శకత్వం వహించబోయే ‘బెంగాల్ టైగర్’ ముహూర్త కార్యక్రమాలు జనవరి 31న జరుగుతాయని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాకు కె.కె.రాధామోహన్ నిర్మాత. హిందీ నటుడు బోమన్ ఇరానీ కీలక పాత్రలో నటిస్తారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.