హైదరాబాద్‌లో ఘనంగా భావ రస నాట్యోత్సవం సీజన్-1 ప్రారంభం

img 4551

హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనా వేదికగా ‘భావ రస నాట్యోత్సవం – సీజన్ 1’ ఆదివారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. ‘మదాలస – స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఫీనిక్స్ గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ శ్రీ సురేష్ చుక్కపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

​ఈ ప్రదర్శనలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి. నాయర్, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్రకుమార్, హైదరాబాద్‌కు చెందిన విద్వాన్ సౌజన్య శ్రీనివాస్ తమ అసాధారణ ప్రతిభను చాటారు. సౌజన్య శ్రీనివాస్ ‘శ్రీ విఘ్నరాజం భజే’ గణేశ కృతితో వేడుకను ఘనంగా ప్రారంభించగా, అనంతరం అర్ధనారీశ్వర స్తోత్రం, త్యాగరాజ కృతి ‘ఎందరో మహానుభావులు’ అంశాలతో అలరించారు.

​మరోవైపు స్వప్న రాజేంద్రకుమార్ మోహినియాట్టం వర్ణం, తిల్లానాలతో శాస్త్రీయ నృత్యపు సొబగులను అద్దం పట్టారు. మంజు నాయర్ శివప్రసాద పంచకం, అష్టపది మరియు ఆంజనేయ కీర్తనలతో ప్రేక్షకులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ నృత్యోత్సవం భారతీయ శాస్త్రీయ కళా వైభవాన్ని చాటిచెప్పింది.

Exit mobile version