చిరు ‘సైరా నరసింహారెడ్డి’ లో భారీ మార్పు !


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించబడిన ఈ సినిమా కోసం స్టార్ నటీనటులు టెక్నీషియన్లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ టెక్నీషియన్లలో సినిమాటోగ్రఫీ కోసం ప్రముఖ సినిమాటోగ్రఫర్ రవివర్మన్ ను అనుకున్నారు. కానీ ఆయన శంకర్, కమల్ లు చేయనున్న ‘ఇండియన్-2’ కోసం ఈ ప్రాజెక్టులోంచి తప్పుకున్నారట.

ఆయన స్థానంలో రత్నవేలును తీసుకున్నారట మెగా టీమ్. సినిమా విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఈ వేగవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారట. రత్నవేలు ప్రస్తుతం చరణ్ చేస్తున్న ‘రంగస్థలం 1985’ కి కెమెరా భాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఒకసారి ఆ సినిమా పూర్తవగానే ‘సైరా’ టీంలో చేరిపోతారట ఆయన. అయితే ఈ భారీ మార్పుపై వంద శాతం కన్ఫర్మేషన్ కు రావాలంటే మాత్రం నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ డిసెంబర్ నుండి మొదలుకానుంది.