‘బాహుబలి-2’ ఆడియో వేడుకను భారీగా ప్లాన్ చేస్తున్న రాజమౌళి !
Published on Mar 5, 2017 7:35 pm IST


ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు గుర్తుండిపోయే తేదీల్లో ఏప్రిల్ 28 మొదటిది. ఎందుకంటే ఆ రోజే తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు యావత్ భారతీయ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న ‘బాహుబలి – 2’ రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక రిలీజుకు గట్టిగా రెండు నెలలు కూడా లేకపోవడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. అందులో భాగంగానే ఆడియో వేడుకను భారీగా నిర్వహించాలనే ప్లాన్స్ వేస్తున్నాడట జక్కన్న.

మొదటి భాగం యొక్క ఆడియోని తిరుపతిలో లాంచ్ చేయగా రెండవ పార్ట్ పాటలను వైజాగ్లో చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు పథకం మారిందని, హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి కోసం వేసిన భారీ మాహిష్మతి సెట్లోనే ఆడియో వేడుక జరిగే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ప్రేక్షకులకు సినిమాలో కంటే ముందే మాహిష్మతి సామ్రాజ్య కృత్రిమ నిర్మాణాన్ని దగ్గర నుండి చూసే అవకాశం లభిస్తుంది. మరి మన దర్శకధీరుడు ఆడియో వేడుక వేదికను ఎక్కడ ఫైనల్ చేస్తాడో చూడాలి.

 
Like us on Facebook