సమీక్ష : బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ – ఆసక్తిగా సాగని పోలీస్ డ్రామా !

Bilalpur Police Station review

విడుదల తేదీ : మార్చి 15, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా, ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ త‌దిత‌రులు.

దర్శకత్వం : నాగసాయి మాకం

నిర్మాత : మహంకాళి శ్రీనివాస్

సంగీతం : సాబూ వర్గీస్

సినిమాటోగ్రఫర్ : తోట విరమణ

ఎడిటర్ : ఎస్ బీ ఉద్ధవ్

నాగసాయి మాకం దర్శకత్వంలో ఎంఎస్ క్రియేషన్స్ పతాకం పై మహంకాళి శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

 

సూర్య (మాగంటి శ్రీనాథ్) బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ కు యస్.ఐ గా వస్తాడు. ఒక సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా ఏదో చేసేద్దాం అనుకుంటే.. తీరా అక్కడకు వచ్చాక.. సూర్య కోడి కేసు, దూడ కేసులను డీల్ చెయ్యాల్సి వస్తోంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఓ రోబరి జరుగుతుంది. ఆ రోబరి చేసిన వాళ్ళను వెతికి పట్టుకునే క్రమంలో.. ఒక అమ్మాయి కనిపించట్లేదని.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తారు. అసలు ఆ అమ్మాయి ఏమైపోయింది ? అలాగే ఆ రోబరి చేసిన వాళ్ళు ఎవరు ? ఫైనల్ గా సూర్య రోబరి చేసిన వాళ్ళను పట్టుకున్నాడా ? లేదా ? అదేవిధంగా ఆ అమ్మాయి ఏమైపోయిందో కనిపెట్టాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మాగంటి శ్రీనాథ్ హీరోగా మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా నటించాడు. పోలీస్ పాత్రకు తగ్గట్లే లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా ఫిట్ గా ఉన్నాడు. నటన పరంగా కూడా కొన్ని సన్నివేశాల్లో ముఖ్యంగా.. ఒక తండ్రి, తన కూతురు కనిపించట్లేదని ఫిర్యాదు చేసే సన్నివేశంలో గాని, అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో గాని తన రియలిస్టిక్ యాక్టింగ్ తో శ్రీనాథ్ ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. అలాగే హీరోయిన్ తో సాగే ప్రేమకు సంబంధించిన ట్రాక్ లో కూడా మాగంటి శ్రీనాథ్ నటన బాగుంది.

ఇక హీరోయిన్ గా నటించిన మేఘనా కూడా తన నటనతో పర్వాలేదనిపిస్తోంది. అయితే ఆమెకు ఎక్కువ స్క్రీన్ టైం లేనప్పటికీ.. హీరోతో సాగే సీన్స్ లో తన రొమాంటిక్ లుక్స్ తో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా మేఘనా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తోంది.

మరో కీలక పాత్రలో నటించిన గోరేటి వెంకన్న కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. తన నటనా కెరీర్ లో ఆయన గుర్తు పెట్టుకున్నే పాత్రను ఈ సినిమాలో చేశారు. అలాగే ఆయన పలికిన మాటలు కూడా అక్కడక్కడ బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్:

 

ఈ చిత్రంలో చెప్పుకోవడానికి చాలా పాత్రలు చాలా ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి కానీ.. ఏది ఆసక్తికరంగా సాగదు. కొన్ని సన్నివేశాల్లో అయితే దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ… ఆ రాసుకున్నది అలాగే తీసుకుంటూ వెళ్ళిపోయాడా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు.. ఆ తరువాత కూడా ప్లో లేని సీన్లతో, అలరించని కామెడీతో సినిమాని నడిపాడు.

సినిమాలో అవసరానికి మించి పాత్రలు ఉండటంతో ప్రేక్షకుడు ఏ పాత్రతోనూ కనెక్ట్ కాలేడు. ఇక కనిపించకుండా పోయిన కూతురి కోసం తల్లిదండ్రులు పడే బాధను ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. అది కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేకపోవడం, మరియు అలాంటి కేసులకు సంబంధించిన ఎమోషనల్ కంటెంట్ ను హీరోకి ఎమోషనల్ గా బలంగా కనెక్ట్ చేయలేకపోవడం వంటి అంశాలు సినిమాకు బలహీనతలకు నిలుస్తాయి. పైగా ఉన్న తల్లిదండ్రుల ఎమోషనల్ కంటెంట్ ను కూడా ఒక సాంగ్ కే పరిమితం చేయడంతో ఆ కంటెంట్ కూడా తేలిపోయింది.

ఓవరాల్ గా బలహీన సంఘటనలతో సాగే కథనంలో.. బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. దర్శకుడు కథలో కీలకమైన అంశాలను మరియు సన్నివేశాలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగానికి వస్తే.. ఈ చిత్ర దర్శకుడు నాగసాయి మాకం రెగ్యూలర్ సినిమాలకి కాస్త కొత్తగా వైవిధ్యంగా సినిమాను తీసే ప్రయత్నం చేశాడు గాని, అది ఏ మాత్రం సంతృప్తికరంగా సాగలేదు. స్క్రిప్ట్ పై దర్శకుడు ఇంకా శ్రద్ధ పెట్టి ఉండి ఉంటే.. ఈ సినిమా కొంతవరకు పర్వాలేదనిపించేది.

ఇక తోట వి రమణ సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లే ఉంది. ఎస్ బీ ఉద్ధవ్ ఎడిటింగ్ పర్వాలేదు కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. సంగీత దర్శకుడు సాబూ వర్గీస్ అందించిన పాటల్లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఆడపిల్ల పాట చాలా ఎమోషనల్ సాగుతూ ప్రేక్షకుడి గుండె లోతుల్లోకి వెళ్తుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు :

 

మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా, నాగసాయి మాకం దర్శకత్వంలో వచ్చిన ఈ పోలీస్ సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. సినిమాలో అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మరియు ఎమోషనల్ గా అమ్మాయి ట్రాక్ పర్వాలేదనిపించినా.. సినిమాలో అవసరానికి మించి పాత్రలు ఉండటం, చాలా వరకు ప్లో లేని సీన్లతో మరియు అలరించని కామెడీతో సినిమాని నడపడం, ఎమోషనల్ కంటెంట్ ను చెయ్యాల్సినంత బాగా ఎలివేట్ చేయలేకపోవడం, ఉన్న కంటెంట్ ను కూడా హీరోకి బలంగా కనెక్ట్ చేయలేకపోవడం వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా ఈ సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version