‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’ నుండి గోరేటి వెంకన్న పాట విడుదల
Published on Aug 13, 2018 10:00 am IST

నాగసాయి మాకం దర్శకత్వంలో ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో గోరేటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాయకుడు గోరేటి వెంకన్న మాట్లాడుతూ..ఈ చిత్రంలో గీత రచయితగా, గాయకుడిగానే కాకుండా నటుడిగా అవకాశం ఇచ్చారు. కథలో ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. చక్కటి సంగీత, సాహిత్య విలువలున్న చిత్రమిది. దర్శకుడు బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని స్పష్టతతో తెరకెక్కించారు. కావాల్సినంత వినోదం ఉంటుంది. నేను నిలకడగా ఒక చోట ఉండను. అలాంటిది నాతో కొన్ని రోజుల పాటు షూటింగ్ చేశారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ మన తెలుగు సినిమాను కొత్త దారిలో తీసుకెెళ్లే చిత్రమవుతుందన్నారు.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ….సాహిత్యానికి చిన్న పెద్దా లేదని దర్శక రత్న దాసరి గారు నాతో చెప్పేవారు. చిన్న హీరోకు పాట రాసినా సూపర్ స్టార్ కు రాసినట్లే భావించి పనిచేయాలని అనేవారు. గురువు గారి మాటను నిత్యం పాటిస్తున్నాను. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఓ పాట రాశాను. ఏదో రాసి ఇద్దాం అనుకోకుండా మనసు పెట్టి రచించాను. దర్శక నిర్మాతలు మంచి వాళ్లు. ఓ మంచి చిత్రం చేయాలని ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నాన్ని అందరం ప్రోత్సహించాలన్నారు.

నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ…నేను ఈ చిత్రాన్ని నా ప్యాషన్ కోసం చేయలేదు. వ్యాపారం కోసమే చేశాను. చాలా మంది కొత్త నిర్మాతలు సినిమాను ప్యాషన్ కోసం నిర్మించాం అని చెప్పుకుంటారు. అలా చెప్పుకునే వాళ్లంతా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సినిమాను వ్యాపారం లాగే చేయాలి. అప్పుడే ఎవరి ప్యాషన్ కైనా అర్థం ఉంటుంది. పెట్టిన ఖర్చు తిరిగి రాకుంటే ప్యాషన్ ఉండి ఏం లాభం?. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని కొత్త తరహా కథా కథనాలతో రూపొందించాం. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు.

  • 2
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook