నాని సినిమాలో బాలీవుడ్ నటుడు !

28th, June 2017 - 09:18:31 AM


టాలీవుడ్ యంగ్ హీరో నాని చేస్తున్న నూతన చిత్రం ‘ఎమ్.సి.ఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)’. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. విశేషమేమిటంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ నటిస్తున్నాడట. హిందీలో ఇటీవలే విడుదలై విమర్శకులను మెప్పించిన ‘పింక్’ సినిమాలో నటించిన విజయ్ వర్మ తన నటనకు గాను మంచి ప్రసంశలు అందుకున్నాడు.

ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక కథనం ప్రకారం తన పాత్ర గురించి మాట్లాడిన విజయ్ వర్మ తన ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వేణు శ్రీరామ్ బొంబాయ్ వచ్చి తనకీ స్క్రిప్ట్ చెప్పారని. నచ్చి వేంటనే ఒప్పుకున్నానని, ఈ సినిమాలో చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అంతేగాక తన పాత్ర తాలూకు షూటింగ్ మొదలైపోయిందని, తెలుగు డైలాగ్స్ తానే స్వయంగా నేర్చుకుని ఎలాంటి సహాయం లేకుండా చెబుతున్నానని తెలిపారు. అయితే తన పాత్ర ఏమిటి, అది ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మాత్రం సీక్రెట్ గానే ఉంచారాయన. ఇకపోతే దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.