వివాదంలో హిందీ “జెర్సీ” మూవీ.. విడుదల ఆపాలంటూ కోర్టుకెక్కిన రచయిత..!

వివాదంలో హిందీ “జెర్సీ” మూవీ.. విడుదల ఆపాలంటూ కోర్టుకెక్కిన రచయిత..!

Published on Apr 13, 2022 11:01 PM IST

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన “జెర్సీ” చిత్రం మరోసారి వాయిదా పడింది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి హిందీలో తెరకెక్కించారు. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కెజిఎఫ్-2, బీస్ట్‌ చిత్రాల కారణంగా ఏప్రిల్‌ 22కు మరోసారి వాయిదా పడింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. జెర్సీ మూవీ స్క్రిప్ట్‌ నాదే అంటూ బాలీవుడ్‌ సినీ రచయిత రూపేశ్‌ జైశ్వల్‌ కోర్టును ఆశ్రయించాడు. 2007లో “ది వాల్‌’ అనే పేరుతో ఈ కథకు సంబంధించిన కాపీరైట్స్‌ను ఫిలిం రైటర్స్‌ అసోసియేషన్‌లో నేను ముందుగానే రిజిస్టర్‌ చేయించానని, తెలుగుతో పాటు హిందీ జెర్సీ సినిమా కథ నాదేనని అన్నాడు. నా కథలో కొన్ని మార్పులు చేసి నాకు తెలియకుండా స్క్రిప్ట్‌ తీసుకున్నారని కోర్టుకు తెలిపాడు. అంతేకాదు ఏప్రిల్‌ 22న విడుదల కాబోతోన్న ఈ మూవీని థియేటర్లతో సహా మరే ఇతర ఓటీటీల్లో కూడా విడుదల చేయకుండా ఆపాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. మరీ ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడుతుందా? దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు