కంప్లీట్ ప్యాకేజీతో అలరిస్తోన్న ‘బ్రూస్ లీ’ ట్రైలర్!

Bruce-Lee1
‘బ్రూస్ లీ’.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున నిర్మితమవుతోన్న సినిమా. తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిన నేపథ్యంలో భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులే కాక ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, అక్టోబర్ 16న దసరా సీజన్‌కు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో బ్రూస్‌లీ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ఇక ఇప్పటికే టీజర్స్, పోస్టర్స్ ద్వారా ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, నిన్న విడుదలైన ట్రైలర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. రామ్ చరణ్ మ్యాన్లీ లుక్స్, స్టైలిష్ ఫైట్స్ ఈ ట్రైలర్‌కు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. శ్రీనువైట్ల సినిమా అంటే కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు మంచి యాక్షన్ నేపథ్యం కూడా ఉంటుంది. బ్రూస్ లీ కూడా అదే కోవలో అన్ని అంశాలనూ మేళవించుకున్న సినిమాగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్న రామ్ చరణ్ చేసే ఫైట్స్‌ ఏ రేంజ్‌లో ఉండనున్నాయనే విషయాన్ని ట్రైలర్ రుచి చూపించింది.

ఇక శ్రీనువైట్ల సినిమాల్లో ఓ హైలైట్‌గా కనిపించే బ్రహ్మానందం ఈ సినిమాలో సుజుకీ సుబ్రమణ్యం అనే మరో నవ్వించే పాత్రతో సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ ట్రైలర్‌లో థమన్ మ్యూజిక్, డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే పండగ సీజన్‌కు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలనూ నింపుకున్న సినిమాగా ‘బ్రూస్ లీ’ మెప్పించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version