లాంచ్‌కు సిద్ధమైన బన్నీ కొత్త సినిమా!

allu-arjun-harish-shankar
‘సరైనోడు’ లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ తారాస్థాయికి చేరిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ స్టేటస్‌ను అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఆయన తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్‌తో అల్లు అర్జున్ తన కొత్త సినిమా చేయనున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించాం. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా రేపు హైద్రాబాద్‌లో వైభవంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పక్కాగా పూర్తైనట్లు తెలుస్తోంది.

‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్, బన్నీ స్టైల్‌కి సరిపడేలా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశారట. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ పరంగా ఎప్పుడూ కొత్తదనం చూపించే హరీష్, బన్నీ కోసం డిజైన్ చేసిన పాత్ర కూడా అదిరిపోయేలా ఉందని టీమ్ వర్గాల నుంచి సమాచారం.