సైలెంట్ గా పని పూర్తి చేస్తున్న అల్లు అర్జున్ !

15th, December 2016 - 08:43:00 AM

allu-arjun
‘సరైనోడు’ సూపర్ సక్సెస్ తరువాత హీరో అల్లు అర్జున్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘దువ్వాడ జగన్నాథం’. మెగా హీరోలకి కలిసొచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటిగ్ జరుపుకుంటోంది. షూటింగ్ మొదలై చాలా రోజులు కావొస్తున్నా ఈ సినిమా గురించిన అప్డేట్స్ పెద్దగా బయటకు రావడంలేదు. దీన్ని బట్టి చూస్తే బన్నీ అండ్ టీమ్ సినిమా విశేషాలను వీలైనంత గోప్యంగా ఉంచి అభిమానులకు ఒకేసారి పెద్ద ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారని అర్థమవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబందించిన కొత్త షెడ్యూల్ డిసెంబర్ 18 నుండి హైదరాబాద్ లో మొదలుకానున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యే కూతురు పుట్టడంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన బన్నీ ఈ షెడ్యూల్ తో షూట్లో తిరిగి జాయిన్ అవుతాడట. సుమారు 15 రోజులు జరగనున్న ఈ షెడ్యూలోనే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. ఇందులో స్టైలిష్ స్టార్ రెండు భిన్నమైన గెటప్స్ లో అలరించనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తుండగా ‘ముకుంద, ఒకలైలా కోసం’ ఫేమ్ పూజ హెగ్డే బన్నీకి జోడీగా నటిస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ లింగుస్వామి డైరెక్షన్లో ఒక ద్విభాషా చిత్రాన్ని త్వరలోనే మొదలుపెట్టనున్నాడు.