తన సినిమాని తానే డైరెక్ట్ చేయనున్న స్టార్ హీరో !

తమిళ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ధనుష్ కేవలం నటుడిగా మాత్రమే కాక దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘పవర్ పాండి’ మంచి విజయాన్ని సాధించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ధనుష్ రెండో సినిమాని డైరెక్ట్ చేయనున్నారట.

అది కూడా ఆయన సినిమానే కావడం విశేషం. తేనాండాళ్ ఫిలిమ్స్ తో ధనుష్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాను ఆయన లీడ్ రోల్ చేయడమేగాక స్వయంగా డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. అంతేగాక ఇది ఒక పిరియాడికల్ డ్రామాగా ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందో తెలియాలంటే ధనుష్ లేదా తేనాండాళ్ ఫిలిమ్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.