దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రపంచ సినిమా రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్, మరియు పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ పాన్-వర్ల్డ్ మూవీని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
సుమారు 50 భాషల్లో, 120 దేశాల్లో విడుదల కానున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. నటీనటుల అసలైన భావోద్వేగాలు ప్రతి భాషలోనూ ప్రేక్షకులకు వక్రీకరణ లేకుండా చేరాలన్నదే రాజమౌళి ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం టెక్నాలజీపై ఆధారపడకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్‌లను పూర్తిగా తిరస్కరించాలని మేకర్స్ నిర్ణయించారు.
కేవలం రియల్ వాయిస్ ఆర్టిస్టులకే ప్రాధాన్యతనిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 మంది డబ్బింగ్ కళాకారుల గొంతులను పరిశీలించి తగిన నటీనటులను ఎంపిక చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ వంటి అనేక అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం అలరించనుంది.
