ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను బుధవారం రోజు స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. అయితే, ఈ క్రేజీ సీక్వెల్‌ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70ఎంఎం థియేటర్లో స్పెషల్ ప్రీమియర్‌ని వీక్షించేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి వచ్చారు.
ఈ సందర్భంగా తమ అభిమన నటుడిని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా థియేటర్‌లోకి చొచ్చుకుని వెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు తాజాగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సంధ్య 70 ఎంఎం వద్ద జరిగిన తొక్కిసలాటకు ఆ థియేటర్ యాజమాన్యం కారణమని వారు పేర్కొన్నారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం తోనే ఈ తొక్కిసలాట జరిగిందని.. అల్లు అర్జున్ టీమ్ కూడా దీనికి బాధ్యులవుతారని పోలీసులు పేర్కొన్నారు.
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 105, 118 (1) r/w 3(5) బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని.. పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా చూస్తామని డిసిపి తెలిపారు.