ఫస్ట్ లుక్ తోనే ఫిదా చేసిన రామ్ చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘రంగస్థలం 1985’ ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్ననే విడుదలైంది. అందులో చరణ్ పంచెకట్టుతో పక్కా మాస్ లుక్ లో కనిపిస్తూ అభిమానుల్ని ఫిదా చేసేశాడు. లుక్ చూసిన ప్రతి ఒక్కరు చరణ్, సుకుమార్ లను అభిమానందనలతో ముంచెత్తుతున్నారు. సినీ విశ్లేషకులైతే ఇన్నాళ్లు హీరోలను చాలా క్లాస్ గా చూపించిన సుకుమార్ మొదటిసారి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా చేస్తుండటంతో కమర్షియల్ గా సినిమా భారీ సక్సెస్ ను సాధించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

మెగా అభిమానులైతే లుక్ విడుదలైన దగ్గర్నుండి హడావుడి చేస్తూ టీజర్, ట్రైలర్, ఆడియోలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎదురుచూడటం మొదలుపెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తుండగా ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 1980ల కాలంలో నడిచే గ్రామీణ నైపత్య ప్రేమకథగా ఉండనుంది. ఈ చిత్రాన్ని 2018 మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.