చిరు సినిమా ఫస్ట్‌లుక్‍కు చరణ్ స్పెషల్ ప్లాన్స్!

chiru-first-look
మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడు మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలవుతుందా అని చాలాకాలంగా చూసిన ఎదురుచూపులకు తెరదించుతూ, కొద్దిరోజుల క్రితం సెట్స్‌పైకి వెళ్ళిన ఆయన సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను టైటిల్‌తో పాటే ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్‌లుక్ చెప్పిన తేదీకే పక్కాగా వచ్చేస్తుందని తెలుపుతూ, చరణ్, నిన్న సాయంత్రం ఓ ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు.

అదేవిధంగా చిరు పుట్టినరోజును పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఫస్ట్‌లుక్ విడుదలకు భారీ క్రేజ్ తెచ్చేలా రామ్ చరణ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక అందుకు తగ్గట్టే సినిమా అభిమానులందర్నీ ఆకట్టుకునేలా ఉండేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా రైతుల సమస్యలు, వారి భూములను కార్పోరేట్ సంస్థలు ఎలా చేజక్కించుకుంటున్నాయి? అన్న అంశాలపై సినిమా నడుస్తూ ఉంటుంది.