ఇంటర్వ్యూ : భూమిక – నాకు, నానికి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది !

ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక ఇప్పుడు రూట్ మార్చి కొత్త ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి చేసిన మొదటి సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. ఈ సినిమాలో హీరో నానికి వదినగా నటించిన ఆమె నటనతో అందరినీ మెప్పించారు. సినిమా సక్సెస్ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) వదినగా నటించడం ఎలా ఉంది ?
జ) వదినగా నటించడం చాలా బాగుంది. 3 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా చేశాను. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పాత్ర ఇప్పటి వరకూ చేయలేదు.

ప్ర) రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) సినిమా చూసిన అందరూ నా పాత్ర బాగుందని అంటున్నారు. నాకొచ్చిన మెసేజెస్ లో అన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి. నాకు, నానికి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంటున్నారు.

ప్ర) నటిగా మీ జర్నీ ఎలా ఉంది ?
జ) మనం కూడా హాలీవుడ్ స్థాయిని అందుకుంటున్నాం. అక్కడ 60 ఏళ్లకు కూడా నటిస్తుంటారు. హిందీలో కూడా అంతే. తెలుగులో పెళ్లి అయిపోయాక కెరీర్ అయిపోయిందని అనుకుంటారు. ఆ మైండ్ సెట్ మారాలి. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు చేయాలనేదే నా కోరిక.

ప్ర) మీ కెరీర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ ఏది ?
జ) ‘అనసూయ, మిస్సమ్మ’ సినిమాలు, వాటిలో నా పాత్రలు నాకు చాలా ఇష్టమైనవి. నటిగా అవి నాకు బాగా సంతృప్తినిచ్చాయి.

ప్ర) మీ కొత్త సినిమాలేవైనా ఉన్నాయా ?
జ) తమిళంలో ప్రభుదేవాతో చేసిన ‘కాలవాడియా పోజ్హుతుగల్’ సినిమా ఈరోజే రిలీజవుతోంది.

ప్ర) నాని, సాయి పల్లవితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) నాని చాలా మంచి నటుడు. కెమెరా ఆన్ చేయగానే ఇట్టే హావభావాలు మార్చేస్తాడు. వరుస హిట్లున్నా సింపుల్ గానే ఉంటాడు. మంచి హ్యూమన్ బీయింగ్. ఇక సాయి పల్లవి అయితే చాలా ఎనర్జిటిక్. ఆమెకు లైఫ్ అంటే ఏంటో బాగా తెలుసు. ముందే అన్నీ నేర్చుకునే సినిమాల్లోకి వచ్చింది.

ప్ర) మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పాలనేది ఎవరి ఆలోచన ?
జ) సినిమా చూసాక నేనే చెప్పాలని అనుకున్నాను. నేను చేసిన పాత్రలకి డబ్బింగ్ చెప్పుకోవడమంటే నాకు చాలా ఇష్టం. ‘సవ్యసాచి’ లో కూడా నేనే చెప్పాలని అనుకుంటున్నాను. మరి ఎలా జరుగుతుందో చూడాలి.

ప్ర) మీ తర్వాతి సినిమాలేంటి ?
జ) హిందీలో ‘కామూషి’ మార్చిలో రిలీజవుతుంది. అదొక థ్రిల్లర్. ఇకోపోతే తమిళంలో ప్రభుదేవా సినిమా ఈరోజు రిలీజవుతోంది.

ప్ర) ఇంకా తెలుగులో కొత్త సినిమాలేమైనా ఉన్నాయా ?
జ) ఇంకా వేటికీ సైన్ చేయలేదు. చేసిన సినిమాలన్నీ విడుదలైపోతే కొత్తవాటి గురించి ఆలోచిస్తాను.

ప్ర) ఫ్యామిలీని చూసుకుంటూ, వేరే వేరే భాషల్లో నటిస్తున్నారు కదా ఎలా మేనేజ్ చేస్తున్నారు ?
జ) నా కజిన్ సిస్టర్ నాతో పాటే ఉంటారు. నాకు ఫ్యామిలీ నుండి మంచి సపోర్ట్ ఉంది. అందుకే ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతున్నాను.

ప్ర) దిల్ రాజుగారి నిర్మాణంలో సినిమా చేయడం ఎలా ఉంది ?
జ) నేను ఇంతకు ముందు చాలా మంది మంచి నిర్మాతలతో వర్క్ చేశాను. దిల్ రాజుగారితో సినిమా చేయడం చాలా బాగుంది. అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉంటారు.