
సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వినవయ్యా రామయ్య’. ఈ చిత్రంతో కృష్ణారెడ్డి తనయుడు నాగ అన్వేష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘దృశ్యం’ ఫేం కృతిక జయకుమార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వివి వినాయక్, దిల్ రాజు, శ్రీకాంత్, బి.గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.
హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగా నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖులు మాట్లాడుతూ… భవిష్యత్ లో నాగ అన్వేష్ మంచి హీరోగా ఎదగాలని, ‘వినవయ్యా రామయ్యా’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, నరేష్, రామరాజు, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూరుస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్.