విజయవంతమైనా వివాదాలపాలైన చిరు, బాలయ్య సినిమాల విజయోత్సవాలు

Published on Feb 1, 2023 12:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీకి ఒకరోజు ముందు, అనగా జనవరి 12న రిలీజ్ అయిన బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీ కూడా మంచి అంచనాలతో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు వీటిని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. ఇక మొదటగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విజయోత్సవాన్ని జనవరి 23న నిర్వహించారు.

అయితే ఈ వేడుకలో సీనియర్ నటులైన ఏఎన్నార్, ఎస్వీఆర్ ల పై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసారని కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోల్స్ చేసారు. అయితే బాలకృష్ణ కేవలం మాటల సందర్భంలోనే వారిద్దరి గురించి మాములుగా మాట్లాడారు తప్ప వారిని ఏమాత్రం కించపరిచే ఉద్దేశ్యం ఆయనకు లేదంటూ కొందరు ఆయనకు మద్దతు పలికారు. కాగా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ వంటి దిగ్గజ నటులను అగౌరవ పరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ నాగచైతన్య, అఖిల్ ఒక ప్రెస్ నోట్ ద్వారా స్పందించారు. ఇక జనవరి 28న జరిగిన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో కూడా ఒకింత విమర్శలు వచ్చాయి.

ఈవెంట్ లో మాటల సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ రవితేజ ని చిన్న హీరో అంటూ సంబోదించారని కొందరు ట్రోల్స్ చేయగా, ఆ ఈవెంట్ కి గెస్ట్ గా విచేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ కొందరు నిర్మాతలు మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాతలను చూసి నేర్చుకోవాలని, అలానే చిరంజీవి గారు మౌనంగా ఉంటేనే ఇలా ఉంది, కానీ మేము మాత్రం ఆయనంత మౌనంగా ఉండం అంటూ వ్యాఖ్యానించారు. కాగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో కొందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారని విమర్శలు వచ్చాయి. మొత్తంగా అటు వీరసింహారెడ్డి, ఇటు వాల్తేరు వీరయ్య సినిమాలు రెండూ కూడా సంక్రాంతి కి రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ రెండు సినిమాల యొక్క విజయోత్సవాలు మాత్రం ఒకింత విమర్శల పాలవడం నిజంగా ఊహించని పరిణామమేనని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :