కే విశ్వనాథ్ పై చిరు భావోద్వేగ పోస్ట్.!

కే విశ్వనాథ్ పై చిరు భావోద్వేగ పోస్ట్.!

Published on Feb 3, 2023 8:00 AM IST

టాలీవుడ్ లో ఇటీవల నెలకొన్న తీవ్ర విషాదాల్లో మరో ఊహించని విషాదం కే విశ్వనాథ్ గారు ఇక లేరు అనే మాట వినాల్సి వస్తుంది అని అనుకోని ఉండరు. కానీ ఈ ఊహించని వార్త రావడంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఛిద్రం అయ్యిపోయింది. ఈ హృదయ విదారక వార్తని వారు తీసుకోలేకపోతూ తమ భావోద్వేగాన్ని వెల్లడి చేస్తున్నారు.

అయితే కళా తపస్వి కి ఎంతో ఆప్తులు పుత్రు సమానులు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఈ వార్త విన్నాక తన భావోద్వేగ స్పందనను అయితే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

“ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతి ని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ, ‘స్వయంకృషి, ‘ఆపద్బాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో వున్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి.

43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.” అని విశ్వనాథ్ గారిని కలిసిన పలు ఫోటోలు షేర్ చేసి తన భావోద్వేగాన్ని వెలుబుచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు