‘ఓం నమో వెంకటేశాయ’పై ప్రశంసలు కురిపించిన చిరు!


కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ‘ఓం నమో వెంకటేశాయ’ పేరుతో తెరకెక్కిన భక్తిరస చిత్రం నేడు పెద్ద ఎత్తున విడుదలవుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాపై అన్నిచోట్లా మంచి అంచనాలున్నాయి. ఇక నిన్న రాత్రి హైద్రాబాద్‌లోని సినీ మ్యాక్స్‌లో కొందరు ప్రముఖులకు ఓం నమో వెంకటేశాయ స్పెషల్ షో వేశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ షోకు విచ్చేసి సినిమా చూశారు.

ఇక తదనంతరం చిరు మాట్లాడుతూ.. “ఓం నమో వెంకటేశాయ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటి సినిమా. కొన్ని సన్నివేశాలకు కంటతడి పెడుతూనే ఉన్నా. ఇలాంటి సినిమాలు చేయాలంటే మన నాగార్జునకు మాత్రమే సాధ్యం. ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం కూడా దర్శకుడూ రాఘవేంద్రరావు గారికే సాధ్యం” అంటూ చిరు, ఓం నమో వెంకటేశాయపై ప్రశంసలు కురిపించారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తుడు హతిరామ్ బాబా పాత్రలో నటించారు.