చిరు ఏదీ దాచాలనుకోవడం లేదు !

18th, December 2017 - 05:16:37 PM

మెగాస్టార్ చిరంజీవిగారి ప్రతిష్టాత్మకమైన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో చిరు తోలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విషయంలో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎక్కువగా ఎగ్జైట్ చేస్తున్న అంశం చిరు గెటప్.

అవును ఈ పాత్ర కోసం ఆయన వయసును సైతం లెక్కచేయకుండా వర్కవుట్స్ చేస్తూ డైట్ పాటిస్తూ యువ హీరోలా, ఇదే మొదటి సినిమా అనే రీతిలో కష్టపడి పాత్రకు కావాల్సిన విధంగా తయారయ్యారు. మీసకట్టు, గడ్డం కూడా పెంచి కొంత ఉగ్రంగా తయారయ్యారు. సాధారణంగా అయితే లుక్ ప్రధానంగా భావించబడే సినిమాలు చేసేప్పుడు హీరోలెవరూ పెద్దగా బయట కనబడరు.

కానీ చిరు మాత్రం అలాంటి దాపరికాలేవీ చేయడంలేదు. సినిమా కోసం చేసుకున్న మేకోవర్ లోనే అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ సినిమా కోసం తానెంత పకడ్బంధీగా సిద్ధమైంది అభిమానులకు చూపిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా చిరు మేకోవర్ చూసి తెగ ముచ్చటపడుతూ నార్మల్ కాస్ట్యూమ్స్ లోనే ఇలా ఉంటే నరసింహారెడ్డి గెటప్లో ఇంకెలా ఉంటారో అంటూ ఊహించుకోవడం మొదలుపెట్టారు.