ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల్ని మెప్పించిన థమన్ !


టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో థమన్ కూడా ఒకరు. ఫాస్ట్ బీట్, మాస్ మసాలా పాటలకు థమన్ పెట్టింది పేరు. ఆయన ఏదైనా సినిమా చేస్తున్నాడంటే ఆడియో ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే స్టార్ హీరోలు, టాప్ దర్శకుల చాయిస్ లో థమన్ ఎప్పుడూ ఉంటుంటాడు. థమన్ కూడా అన్ని సందర్భాల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. తాజాగా ఆయన రెండు పెద్ద సినిమాల మోషన్ పోస్టర్లకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరే ఇందుకు నిదర్శనం.

నిన్న నాగార్జున పుట్టినరోజు సందర్బంగా ఆయన తాజా చిత్రం ‘రాజుగారి గది -2’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో నాగార్జున లుక్స్ తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా క్లిక్ అయింది. అలాగే కొద్దిరోజుల క్రితం విడుదలైన చిరు 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ మోషన్ పోస్టర్ కు సైతం థమన్ నైపథ్య సంగీతం అందించారు. వాస్తవానికి ఈ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకుడైనా మోషన్ పోస్టర్ వరకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

ఈ స్కోర్ అయితే మెగా అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో మోషన్ పోస్టర్ సక్సెస్ లో ఎక్కువ భాగం క్రెడిట్ ను థమన్ కే ఇస్తూ పొగడ్తలతో ముంచెత్తేశారు అందరూ. ఇలా థమన్ తన వినూత్న శైలితో వెంటవెంటనే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల అభిమానుల మన్ననలను దక్కించుకోవడం విశేషమని చెప్పాలి.