చిట్‌చాట్ : శ్రియ – సంక్రాంతి సినిమాలన్నీ హిట్ అవ్వాలి!

shriya
సౌతిండియన్ సినిమాలో లాంగ్ రన్‌తో, స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన తారల్లో శ్రియ ఒకరు. తాజాగా ఆమె నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో హీరోయిన్‌గా నటించారు. జనవరి 12న ఈ సినిమా భారీ ఎత్తున విడుదలవుతోన్న సందర్భంగా శ్రియతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?

స) క్రిష్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నా. ఆ కథలో ఉన్న ఎమోషన్, వశిష్ట దేవి అనే నా పాత్ర అన్నీ బాగా నచ్చాయి. ఇలాంటి ఒక హిస్టారికల్ సినిమాలో మంచి పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.

ప్రశ్న) మీ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

స) మొదట్లో ఈ పాత్ర చేయగలనా? అని కంగారు పడ్డా. సెట్లోకి వచ్చేశాక బాలయ్య గారు, క్రిష్ వీరందరినీ చూసి నాకూ ధైర్యం వచ్చేసింది. రెండో రోజునుంచే పాత్రను ఓన్ చేసుకొని నటించడం మొదలుపెట్టా. సెట్‌కి వెళ్ళకముందు పెద్దగా ప్రిపేర్ అయింది ఏమీ లేదు. క్రిష్ విజన్‌ను ఫాలో అవ్వడమే నేను చేసినది!

ప్రశ్న) బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి’ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు పనిచేయడం ఎలా అనిపించింది?

స) ‘చెన్నకేశవరెడ్డి’ చేసేప్పుడు నా వయసు 18సంవత్సరాలు అనుకుంటా. అంత చిన్న వయసులోనే బాలయ్య గారితో నటించేశా. ఆయన కో యాక్టర్స్‌కు మంచి గౌరవం ఇస్తారు. అలాంటి లెజెండరీ యాక్టర్ వందో సినిమాలో, అదీ శాతకర్ణి లాంటి స్పెషల్ సినిమాలో భాగమవ్వడం అదృష్టంగానే భావిస్తా. శాతకర్ణి షూటింగ్ సమయంలో నా పాత్రకు సంబంధించి కూడా చాలా సలహాలు ఇచ్చేవారు. ఇద్దరం సెట్లో హిస్టరీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుంటూండేవాళ్ళం.

ప్రశ్న) దర్శకుడు క్రిష్ గురించి చెప్పండి?

స) క్రిష్ పక్కా ప్లానింగ్ ఉన్న దర్శకుడు. ఏ పాత్ర ఎలా ప్రవర్తించాలి? ఏ డైలాగ్ ఎంతవరకు ఉండాలి? అనే అంశాలపై మంచి పట్టుందాయనకు. శాతకర్ణి జీవితకథ మొదట్లో నాకూ తెలియదు. క్రిష్ చెప్పాక, హిస్టరీ స్టూడెంట్‌ను అయిన నాకు ఇంకా తెలుసుకోవాలనిపించి, శాతకర్ణి గురించి పూర్తిగా తెలుసుకున్నా. పాత్రల వేషధారణ విషయంలోనూ క్రిష్ తీసుకున్న జాగ్రత్తలను అభినందించాల్సిందే!

ప్రశ్న) సినిమా విజయంపై ధీమాగా ఉన్నారా? సంక్రాంతి పోటీని ఎలా చూస్తారు?

స) ఒక మంచి సినిమాతో వస్తున్నాం కాబట్టి విజయంపై సాధారణంగానే ధీమాగా ఉన్నాం. ఇక పోటీ అనేది సినిమాల మధ్యన ఎప్పుడూ ఉంటుంది. ఏ సినిమాకైనా అందరం కష్టపడి పనిచేస్తాం. కాబట్టి అన్ని సినిమాలూ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను గౌతమిపుత్ర శాతకర్ణిలో నటించాను కాబట్టి మా సినిమా ఇంకొంచెం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా!