ఇటీవల టాలీవుడ్‌లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు ప్రతి సినిమాకూ ఒకే రకమైన సమస్య ఎదురవుతోంది. అనుకున్న సమయానికి సినిమా రాకపోవడం, వాయిదాల మీద వాయిదాలు పడటం కామన్ అయిపోయింది. రీషూట్లు, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వంటి రకరకాల కారణాల వల్ల చెప్పిన తేదీకి సినిమా రాదులే అని అభిమానులు ముందే ఫిక్స్ అయిపోతున్నారు.
ఇటీవలే ‘ది ప్యారడైజ్’ వరుస వాయిదాల తర్వాత రాగా, డిసెంబరులో రావాల్సిన ‘ఫౌజీ’ కూడా షిఫ్ట్ అయింది. ఇక ‘సంబరాల ఏటి గట్టు’, ‘విశ్వంభర’ వంటి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే సినిమాలపై నమ్మకం లేక, ఎప్పుడు ఏ సినిమా వాయిదా పడుతుందో అనే సందిగ్ధంలో ఉన్న ఫ్యాన్స్‌కు రెండు భారీ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వార్త పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. తాజాగా జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రెండు బడా సినిమాలపై క్లారిటీ రావడంతో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఖుషీ అవుతున్నారు.
‘వారణాసి’, ‘డ్రాగన్’ సినిమాలు చెప్పిన సమయానికే వస్తాయని మైత్రీ మూవీస్ రవి స్పష్టం చేశారు. సాధారణంగా రాజమౌళి సినిమాలు వాయిదా పడటం సహజమే అయినప్పటికీ, ‘వారణాసి’ షూటింగ్‌ను త్వరగానే ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టి 2027 ఏప్రిల్ 7నే తెచ్చేలా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ గాయపడి షూటింగ్‌కు బ్రేక్ పడటంతో ‘డ్రాగన్’ వాయిదా పడుతుందేమో అనుకున్నా, 2027 జూన్ 11 రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పూ లేదని తేల్చి చెప్పారు.
