టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన స్టార్ కమెడియన్ !


థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరై సరికొట్త తరహా కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ పృథ్వి. ఆ పాకులారిటీ ఎంతలా ఉందంటే దర్శకులు, రచయితలు ఆయన కోసం ప్రత్యేకంగా సీన్లు రాస్తున్నారు. తాజాగా ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో ఆయన చేసిన కామెడీకి గాను బ్రహ్మాండమైన స్పందన వస్తోంది.

సినిమా ఆరంభం నుండి ఆఖరి వరకు ఉంటూ చివరి అరగంటలో ఆయన పంచిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ మధ్య కాలంలో కేవలం స్పూఫ్ కామెడీనే చేస్తూ కాస్త బోర్ కొట్టించిన పృథ్వి ఇలా ఒక్కసారిగా ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ ను పంచడంతో మరోసారి ప్రేక్షకులు ఆయన్ను అభినందిస్తున్నారు. చిత్ర విమర్శకులైతే ఈ సినిమా సక్సెస్ అవడానికి దోహదపడిన ప్రధాన కారణాల్లో పృథ్వి కూడా ఒకరని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిన్న, పెద్ద సినిమాలు చాలా వాటిలో పృథ్వి నటిస్తున్నాడు.