బాలయ్య సినిమా కోసం భారీ సెట్టింగ్ !

4th, April 2017 - 08:30:33 AM


నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ గురువారంనుండి రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనుంది. నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్లో బాలయ్య, హీరోయిన్ ముస్కాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అందుకోసం 1. 5 కోట్ల రూపాయల వ్యయంతో భారీ కాలనీ, మార్కెట్ సెట్ ను రూపొందించారు.

ఇంతకు ముందెప్పుడూ బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబోలో సినిమా రాకపోవడం, ఆరంభంలోనే పూరి బాలయ్యను అభిమానులు మెచ్చేలా చూపిస్తానని మాటివ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పూరి గత సినిమాలు ‘టెంపర్, హార్ట్ ఎటాక్’ లకు సూపర్ హిట్ సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ ఇవ్వనున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు.