టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి తొలిసారిగా నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది మార్చి 24న రిలీజ్ అయి అతి పెద్ద సంచలన విజయం అందుకోవడంతో పాటు ఇందులోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డుని సైతం దక్కించుకుని గొప్ప రికార్డు సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీతో గ్లోబల్ గా హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఎంతో క్రేజ్ ని మార్కెట్ ని సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వాస్తవానికి 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించిందట యూనిట్. అయితే అదే సమయానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కె, అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ మూవీ రెండూ కూడా బెర్తులు ఖాయం చేసుకున్నాయి. దానితో తమ మూవీని సమ్మర్ కానుకగా మార్చి చివర్లో రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తోందట యూనిట్.
ఇక మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూవీని 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఆ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానితో కొంత ఆలోచన చేసిన గేమ్ చేంజర్ యూనిట్, ఎన్టీఆర్ మూవీ రిలీజ్ కి రెండు వారాలు గ్యాప్ ఉండేలా మార్చి 20న తమ సినిమాని పక్కాగా రిలీజ్ చేయడమే బెటర్ అని భావిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే కొద్దిపాటి గ్యాప్ తో ఈ ఇద్దరు ఆర్ఆర్ఆర్ స్టార్స్ సినిమాల బాక్సాఫీస్ క్లాష్ తప్పదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి గేమ్ చేంజర్ టీమ్ తమ సినిమా రిలీజ్ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.