అది గుర్తొచ్చినప్పుడల్లా తారక్‍ను తిట్టుకుంటూంటా : రాజమౌళి
Published on Sep 27, 2016 7:30 pm IST

SS-RAJAMOULI
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్థాయిని, ఒక ప్రాంతీయ సినిమా ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడాయన. 2001 సెప్టెంబర్ 27న, అంటే సరిగ్గా 15 ఏళ్ళ కిందట ఇదే రోజున రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే సినిమాతో స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇక తమ సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఒకసారి స్టూడెంట్ నెం. 1 రోజులను గుర్తు చేసుకున్నారు.

‘స్టూడెంట్ నెం. 1’ సక్సెస్ క్రెడిట్ ఎక్కువగా పృథ్వీ రాజా అందించిన స్క్రిప్ట్, ఎం.ఎం.కీరవాణి అందించిన మ్యూజిక్‌కే దక్కుతుందని, అక్కడక్కడా తారక్ బాగా నటించినా, నటుడిగా తారక్‌కి కూడా స్టూడెంట్ నెం.1 చెప్పుకోదగ్గ సినిమా కాదని రాజమౌళి అన్నారు. ఇక అదేవిధంగా తన దర్శకత్వం అయితే కొన్ని సన్నివేశాల్లో మినహాయిస్తే అస్సలు ఏమీ తెలియని వారు తీసినట్లు ఉండిందని రాజమౌళి అన్నారు. ఇక ఈ సందర్భంగానే అప్పట్లో అంతా కొత్తవారినైన తమను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. స్టూడెంట్ నెం.1 షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ప్రస్తావించారు.

“స్విట్జర్లాండ్‌లో షూట్ జరిగేప్పుడు నాకు, తారక్‌కు ఒకే రూమ్ కేటాయించారు. నేనేమో 9 గంటలకే పడుకునే అలవాటు ఉన్నవాణ్ణి. తారక్ 12 గంటల వరకూ టీవీ చూస్తుండేవాడు. ఆ టీవీలో కూడా స్విస్ భాషలో ఏదో అగ్రికల్చరల్ ప్రోగ్రాం వచ్చేది. ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ తారక్‌ను తిట్టుకుంటూంటా” అని రాజమౌళి, ‘స్టూడెంట్ నెం. 1’ రోజులను గుర్తు చేసుకున్నారు.

 
Like us on Facebook