‘దృశ్యం 2’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది – నిర్మాత డి. సురేష్ బాబు

‘దృశ్యం 2’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది – నిర్మాత డి. సురేష్ బాబు

Published on Nov 27, 2021 8:20 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాత సురేష్ బాబు మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దృశ్యం 2’ అనేది కమర్షియల్ సినిమా కాదు, పాటలు, ఫైట్లు ఉండే సినిమాలను థియేటర్లో చూస్తే మంచి కిక్ వస్తుంది. దృశ్యం 2ను థియేటర్లో విడుదల చేసినా కూడా ఈ రేటింగ్ వచ్చేది. కానీ కలెక్షన్లు ఎంత వస్తాయనేది చెప్పలేం. ఓటీటీ అనేది ఫైనాన్షియల్‌గా సేఫ్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీ, యూట్యూబ్ వంటి వాటి వల్ల కొత్త టాలెంట్ కూడా వస్తోంది. టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ సినిమాను తీయగలుగుతున్నారని అన్నారు.

ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం అని చెప్పాలి. ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 అది చాలా నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు. ఈ కారణాల వల్ల దృశ్యం 2 సినిమాను ఓటీటీకి ఇవ్వలేదు. ఇది ఓటీటీలో అయితే బాగుంటుందని అనుకున్నామని అన్నారు.

ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరుగుతుంది అనిపిస్తుంది. మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమనేది కూడా కరెక్ట్ కాదు. ఓ ప్రొడక్ట్‌‌ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలలో మాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని, థియేటర్ కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అన్నారు.

మంచి సినిమాను థియేటర్‌లో చూస్తే వచ్చే ఎక్స్‌పీరియన్స్ వేరు. కానీ ఆడియెన్స్ టేస్ట్ మారిపోతోంది. అఖండ, పుష్ప వంటి చిత్రాలకు ఆడియెన్స్ ఖచ్చితంగా వస్తారని, పండుగలకు జనాలు థియేటర్లకు వస్తున్నారని అందరికీ అర్థమైందని, అందుకే ఫెస్టివల్ సీజన్‌కు రావాలని ఫిక్స్ అయ్యారని, ఒకప్పుడు నాలుగు సినిమాలు వచ్చేవి. నాలుగు వందల చొప్పున నాలుగు చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 1500 స్క్రీన్స్‌ కావాలని అంటున్నారు. అక్కడే గొడవ వస్తోంది. చూడాలి ఈ సంక్రాంతికి ఎలా ఉంటుందో అని అన్నారు.

నేను ఈ సినిమా ఇండస్ట్రీలో పుట్టాను. పెరిగాను. నేను ఏం చేసినా కూడా సినిమా పరిశ్రమ కోసమే చేస్తాను. ఎవరో ఏదో అన్నారని నేను పట్టించుకోను. నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. నేను డబ్బు జనరేట్ చేయాలి. ప్రొడక్షన్ కంపెనీ నడపాలి. థియేటర్లను చూసుకోవాలి. శాకిని డాకిని, దొంగలున్నారు జాగ్రత్త, డ్యాన్సింగ్ క్వీన్ అనే మూడు సినిమాలు ఓటీటీకి ఇచ్చేశాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. వెంకటేష్ హీరోగా రానా నాయుడు, ఎఫ్ 3లు కాకుండా ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. అవి రివిల్ చేశాక తప్పకుండా మీరు సర్ప్రైజ్ అవుతారని అన్నారు.

ఇక రానా హీరోగా చేసిన ‘విరాటపర్వం’ ఇంకా ఐదు రోజుల బ్యాలన్స్ షూటింగ్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ అనే వాటిని డబ్బుతో కొలవొద్దు. మన హైద్రాబాద్‌ను దేశానికి సినీ రాజధాని చేసే విధంగా కేటీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమా అనేది ఎక్కువ కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు ఎందుకు అంత సబ్సిడీ ఇస్తున్నారు.. యూపీ ఎందుకు ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తోంది.. సినిమా వల్ల టూరిజం పెరుగుతుంది. డెవలప్‌మెంట్ జరుగుతుంది. సినిమా పరిశ్రమను డబ్బుతో కొలవద్దని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు