చిట్ చాట్ : హీరో అశోక్ – ఈ సినిమా నాకొక పెద్ద ఫ్లాట్ ఫార్మ్ అనుకుంటున్నాను !

31st, July 2017 - 05:27:24 PM


దర్శకుడు సుకుమార్ యొక్క నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ పై హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘దర్శకుడు’. ఈ శుక్రవారం ఈ సినిమా రిలీజ్ సందర్బంగా చిత్ర హీరో అశోక్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

ప్ర) ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది ?

జ) నేను సుకుమార్ గారి ‘వన్ నేనొక్కడినే’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఆ తర్వాత నా రిలేటివ్ హరిప్రసాద్ జక్కా సుకుమార్ గారికి ఈ దర్శకుడు కథ చెప్పగానే ఆయన నువ్వే డైరెక్ట్ చెయ్యి సినిమాని అన్నారు. ఆ తర్వాత హీరో ఎవరనే డిస్కషన్ హరిప్రసాద్ గారు నా పేరు సజెస్ట్ చేశారు. అలా ఈ అవకాశమొచ్చింది.

ప్ర) హీరో అనగానే ఎలా ఫీలయ్యారు ?

జ) ముందుగా సుకుమార్ గారు కూడా అశోక్ హీరో ఏమిటి అనుకున్నారు. ఆ తర్వాత హరిప్రసాద్ జక్కాగారు నాకొచ్చి చెప్పగానే ఒకరోజు టైమ్ అడిగాను. ఎలాగూ అన్నీ ఒకటే కదా అని ఒప్పుకున్నాను.

ప్ర) నానిలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా ?

జ) వాళ్లకు ఉన్నట్టే కాన్ఫిడెన్స్ నాక్కూడా ఉంటుందని నేను అనుకోను. అంతా హరిప్రసాద్ గారే. ఆయన నేను చూసుకుంటాను అని చేయించారు.

ప్ర) ‘దర్శకుడు’ లో ఏం చూపించబోతున్నారు ?

జ) సినిమా బ్యాక్ డ్రాప్లో ఒక లవ్ స్టోరీ. నేను అందులో డైరెక్టర్, ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్. మా ఇద్దరికీ మధ్య జరిగే లవ్ స్టోరీ.

ప్ర) ఈ సినిమా మీకు పెద్ద లాంచ్ అని అనుకుంటున్నారా ?

జ) ఖచ్చితంగా ఇది నాకు పెద్ద లాంచ్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలంతా ఈ సినిమా వేడుకలకు వచ్చారు. సినిమా జనాలకు బాగా రిచ్ అయింది.

ప్ర) మీకు యాక్టింగ్ ఆసక్తి లేదు కదా.. సినిమా మొత్తం చూశాక ఏమనిపించింది ?

జ) నేనేదో బాగా చేశానని కాదు కానీ డైరెక్టర్ కి ఏం కావాలో అది చేశాను. సినిమాలో ఇన్వాల్వ్ అయి చూస్తున్నప్పుడు పర్లేదు బాగానే చేశానని అనిపించింది.

ప్ర) మీ యాక్టింగ్లో సుకుమార్ గారి యాటిట్యూడ్ కనిపించిందా ?

జ) అవును.. ఉంటుంది. వన్ సినిమాకి ఆయనతో కలిసి పనిచేశాను. కాబట్టి ఆయన దేనికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది నాకు, హరిప్రసాద్ గారికి బాగా తెలుసు. కొన్ని సీన్లు రాకపోతే సుకుమార్ ని గుర్తుచేసుకో అనేవారు హరిప్రసాద్ గారు.

ప్ర) సుకుమార్ నుండి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ?

జ) సినిమా చూసిన అయన నాతో బాగా చేసేశావురా అన్నారు. అలాగే డబ్బింగ్ కూడా బాగా చెప్పావని మెచ్చుకున్నారు.

ప్ర) డైరెక్షన్ చేయడం కష్టమా , నటించడం కష్టమా ?

జ) నేనింకా డైరెక్షన్ చేయలేదు కాబట్టి ఆ కష్టం ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పటి దాకా అసిస్టెంట్ గానే పనిచేశాను. అలాంటిది ఒక్కసారిగా దర్శకుడిగా నటించమంటే కాస్త కష్టమైంది.

ప్ర) సన్నివేశాల్ని ఎలా చేయించేవారు ?

జ) ముందుగా సీన్ పేపర్, డైలాగ్ పేపర్ నాకు, ఈషాకు ఇచ్చి చేయమనేవారు. ఒకవేళ ఆయనకు కావాల్సినట్టు రాకపోతే ఇలా చేయాలి అంటూ చేసి చూపించేవారు.

ప్ర) సుకుమార్ గారు సెట్స్ కి ఎప్పుడైనా వచ్చారు ?

జ) ఆయన కథ మాత్రమే విన్నారు. హరిప్రసాద్ గారి నరేషన్ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. అందుకే సెట్స్ లోకి కూడా రాలేదు.