దర్శక రత్న దాసరి నారాయణరావు కన్నుమూత !

Dasari Narayanarao passed away

దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూశారు. ఈరోజు తీవ్ర అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. జనవరి 19న తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కిమ్స్ వైద్యులు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత సుమారు మూడు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్న అయన నెమ్మదిగా కోలుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.

ఆయనకు ఈ నెలలోనే రెండవసారి శస్త్ర చికిత్స జరిగింది. ఈ నైపథ్యంలోనే ఆయన ఈరోజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులలు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆయన కన్నుమూశారు. ఇంకో గంటలో ఆయన పార్థివదేహాన్ని స్వగృహానికి తీసుకురానున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4న జన్మించిన ఆయన 1972లో మొదటి చిత్రం ‘తాత మనవడు’ తో మొదలుపెట్టి సుమారు 151 సినిమాలకు దర్శకత్వం వహించి, 53 సినిమాలను నిర్మించారు. కేవలం దర్శకుడిగా మాత్రమే కాక నటుడిగా, రచయితగా కూడా రాణించిన ఆయన రెండు జాతీయ అవార్డులను, తొమ్మిది నంది అవార్డులను, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్య సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. దర్శకుడిగా ‘ప్రేమాభిషేకం, లంకేశ్వరుడు, అమ్మ రాజీనామా, మేఘ సందేశం, బొబ్బిలి పులి, ఒసేయ్ రాములమ్మ’ వంటి సినిమాల్ని తెరకెక్కించిన అయన చివరగా 2014లో ‘ఎర్ర బస్సు’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు.

Exit mobile version