అసలు గెలుపంటే ఏమిటో కళ్యాణ్ మామ చెప్పాడు – ధరమ్ తేజ్


యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నాగబాబు, ధరమ్ తేజ్ అమ్మ, పిన్నిలు హాజరవడం విశేషం. ఈ సందర్బంగా ధరమ్ తేజ్ తన మేనమామ పవన్ కళ్యాణ్ తనకు గెలుపంటే అసలైన అర్థమేమిటో నేర్పించారని అన్నారు. తేజ్ మాట్లాడుతూ ‘ఒకరోజు నేను గెలిచినా అవార్డ్ తీసుకుని కళ్యాణ్ మామ దగ్గరకి వెళ్ళాను. అప్పుడాయన అసలైన గెలుపుకి అర్థమేమిటో తెలుసా అని అడిగి.. మనం ఓటమిలో ఉన్నప్పుడు ఎవరైనా నీ చుట్టూ ఉంటె అప్పుడు తెలుస్తుంది అసలైన గెలుపంటే ఏమిటో అని చెప్పారు.

అప్పుడర్థమైంది నాకు నా ఈ ప్రయాణంలో నెను గెలుచుకున్న గెలుపు అభిమానులే అని’ అన్నారు. అలాగే దర్శకుడు గోపి చంద్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నటుడు తనను ఎంతో బాగా చూసుకున్నారని, సినిమా తప్పక అలరిస్తుందని అన్నారు. అలాగే నాగబాబు మాట్లాడుతూ ‘తేజ్ మాకందరికీ చాలా ప్రియమైన మేనల్లుడు. ఆటను అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధులు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది.