‘ధృవ’ ఎఫెక్ట్ : చిన్న సినిమాలన్నీ ఇంకా వాయిదా బాటనే..!
Published on Nov 30, 2016 5:50 pm IST

dhruva
సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ పెద్ద హీరో సినిమా వస్తుందంటే ఒక వారం ముందునుంచే అంతటా సందడి మొదలవుతుంది. ఈ హీరోల సినిమాలన్నీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలవుతూ ఉంటాయి. ఈనేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటే, ఇప్పట్నుంచే ఆ సినిమా ప్రభావం ఇతర సినిమాలపై కనిపిస్తూనే ఉంది. ఈ ప్రభావం వల్లే ఈవారం తెలుగు సినిమాల కళ కనబడడం లేదు.

విజయ్ ఆంటోనీ నటించిన ‘సైతాన్’ (తెలుగులో ‘బేతాళుడు’) ఒక్కటే పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రావాలన్న ఆలోచనతో తెలుగు వర్షన్ కూడా రేపే వచ్చేస్తోంది. సుమారు 500 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. కాగా వచ్చేవారానికి మాత్రం ఎక్కువ థియేటర్లు ‘ధృవ’కి వెళ్ళిపోతాయని ట్రేడ్ భావిస్తోంది. దీంతో పాటు ‘మన్యం పులి’ అన్న డబ్బింగ్ సినిమా, ‘అరకు రోడ్‌లో’ అనే మరో చిన్న సినిమా పెద్దగా ఎవ్వరికీ తెలియకుండానే వచ్చేస్తున్నాయి. నవంబర్‌లో కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్‌తో ఆగిపోయిన సినిమాలన్నీ డిసెంబర్ 2కే రావాల్సింది. అయితే మళ్ళీ వారం కాగానే ధృవ వచ్చేస్తే తమ సినిమా థియేటర్లలో ఉంటుందో లేదోనని వేరే సినిమాలేవీ విడుదల కావట్లేదు.

అదేవిధంగా ధృవ రిలీజ్ అయ్యే వారం వేరే ఏ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. ఆ సినిమా రిజల్ట్‌ని బట్టే ఆ తర్వాతి వారం వచ్చే సినిమాలేంటన్నది తెలుస్తుంది. దీంతో ధృవ భారీ రిలీజ్‌కు అందరూ లైన్ క్లియర్ చేయడంతో రామ్ చరణ్ భారీ ఓపెనింగ్స్‌ సాధిస్తారనే ఆశించొచ్చు.

 
Like us on Facebook