‘ధృవ’ సందడి మొదలైపోయింది..!

9th, December 2016 - 04:04:49 AM

ram
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు అంతా సిద్ధమైపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మెగా అభిమానులంతా భారీ ఆశలే పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్ అన్నీ పాజిటివ్ హైప్‌నే తీసుకురావడంతో నేడు విడుదలవుతోన్న సినిమా సక్సెస్‌పై అంతా ధీమాగా ఉన్నారు. ఇక సాధారణంగా ఏ పెద్ద హీరో సినిమాకైనా తెలుగులో బెనిఫిట్ షోస్ నిర్వహించడం అన్నది సాధారణంగా జరుగుతూ వస్తోంది. అయితే ‘ధృవ’కు మాత్రం బెనిఫిట్ షోస్ ఏవీ నిర్వహించలేదు. దీంతో అభిమానులంతా ఉదయం షో పడేవరకూ ఎదురుచూడక తప్పలేదు.

ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే ఓవర్సీస్‌లో మాత్రం ఇప్పటికే ప్రీమియర్స్ సందడి మొదలైపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమాకు పెద్ద మార్కెట్ అయిన యూఎస్‌లో ప్రీమియర్ షోస్‌కు రామ్ చరణ్ స్వయంగా హాజర్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. దర్శకుడు సురేందర్ రెడ్డి, విలన్ అరవింద్ స్వామిలతో కలిసి రామ్ చరణ్ ప్రస్తుతం యూఎస్‌లో ప్రీమియర్ షోస్‌కు హాజరవుతున్నారు. ఈ వారాంతమంతా చరణ్ యూఎస్‌లో ఉండనున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.