ఆఖరి షెడ్యూల్ కు చేరిన గౌతమ్ మీనన్ చిత్రం !

7th, January 2018 - 03:30:58 PM

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన గౌతమ్ మీనన్ ఇటు డైరెక్షన్, అటు ప్రొడక్షన్ అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. మామూలు సమయాల్లోనే సినిమా చేయడానికి ఎక్కువ సమయం తీసుకునే గౌతమ్ మీనన్ నిర్మాతగా మారాక ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా ‘ధృవ నచ్చత్తిరమ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చాన్నాళ్లుగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, ట్రైలర్ ఎప్పుడొస్తుందా అనే ఆలోచనలో ఉన్నారు అభిమానులు. వాళ్ళ కోసమే అన్నట్టు తాజా అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. అదేమిటంటే ఈ చిత్రం యొక్క ఆఖరి షెడ్యూల్ ఈ నెల 25 నుండి మొదలై నెలపాటు జరుగుతుందట. కాబట్టి ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో విక్రమ్ కు జోడీగా రీతూ వర్మ నటిస్తోంది.