దసరాకి చరణ్ సినిమా రావట్లేదా ?

dhruva
2015 సెప్టెంబర్లో వచ్చిన ‘బ్రూస్ లీ’ పరాజయం తరువాత రామ్ చరణ్ లాంగ్ గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించి తమిళ ‘తనీ ఒరువన్’ ను తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపైనే మెగా అభిమానులంతా ఆశలు పెట్టుకుని సినిమా దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదలవుతుందని ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం ధృవ పరిస్థితి అలా లేదు. ఈ చిత్రం దసరా బరిలో నిలిచే సూచనలు కనిపించడంలేదు.

ఎందుకంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే చిత్రానికి సంబందించిన టాకీ పార్ట్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకావాలి. కానీ అలా జరగలేదు. టాకీ పార్ట్ తో పాటు మూడు పాటలు బ్యాలెన్స్, అరవింద స్వామిపై తీయాల్సిన ముఖ్యమైన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. దీంతో హడావుడిగా సినిమాని చుట్టేసే ప్రయత్నం కాకుండా లేటైనా కాస్త టైమ్ తీసుకుని పక్కాగా పూర్తిచేయాలని నిర్మాత అల్లు అరవింద్ అనుకుంటున్నాడట. కనుక ఈ చిత్రం దసరా బరిలో కాకుండా దీపావళి బరిలో నిలిచేలా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.