‘ధృవ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా కథ ప్రకారమే!

dhruva-pre
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వచ్చేస్తుందా? ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అన్న ఉత్సాహంతో మెగా అభిమానులంతా కొద్దికాలంగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పకడ్బందీగా పూర్తి చేసుకున్న సినిమా డిసెంబర్ 9న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇక విడుదలకు ఇంకా కొద్దిసమయమే ఉండడంతో టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను పెద్ద ఎత్తున జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

డిసెంబర్ 4న హైద్రాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నట్లు టీమ్ స్పష్టం చేసింది. సినిమాలో రామ్ చరణ్ ‘ధృవ’ అనే ఓ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. పోలీసుల గొప్పదనాన్ని చూపే సినిమా కావడంతో సాధారణంగా సినిమా ఫంక్షన్‌లు జరిగే ప్రాంతంలో కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను పోలీసుల క్వార్టర్స్ అయిన యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో నిర్వహిస్తే బాగుంటుందని టీమ్ ఈ నిర్ణయం తీసుకుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.