వినాయక చవితికి ‘ధృవ’ టీజర్?

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో హ్యాపీ అయిన టీమ్, ఫస్ట్ టీజర్‌ను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావిస్తోందట. సెప్టెంబర్ 5న వినాయక చవితి సందర్భంగా ఈ ఫస్ట్ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం టాకీ పార్ట్ చివరిదశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా సమాంతరంగా జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. హిపాప్ తమిజా అందించిన ఆడియో సెప్టెంబర్ నెలాఖర్లో విడుదల కానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.