క్లైమాక్స్ షూట్‌లో రామ్ చరణ్ ‘ధృవ’!

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్‍ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొద్దినెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్‌తో పాటు విలన్ అరవింద్ స్వామి పాల్గొంటూండగా ఈ సన్నివేశాల చిత్రీకరణ పకడ్బందీగా పూర్తవుతోంది.

రామ్ చరణ్ ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనుండడం, తమిళంళో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్ కావడం, నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించడం ఇలా ఎన్నో కారణాలతో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా మొదట దసరా కానుగా విడుదలవుతుందనుకున్నా, తాజాగా దసరా రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ విషయమై టీమ్ ఓ ప్రకటన ఇచ్చే సూచన కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.