రణవీర్ సింగ్ హీరోగా డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ఫీవర్ అప్పుడే పీక్స్‌కు చేరుకుంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూస్తుంటే ఈ సినిమా కోసం జనాలు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. అయితే, ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 55 నిమిషాలు (దాదాపు 4 గంటలు) ఉండటం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్కై-హై హైప్ ముందు నాలుగు గంటల నిడివి ఒక లెక్కే కాదా? లేక మల్టీప్లెక్స్ కలెక్షన్లపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సినిమా రన్ టైమ్ పెరిగినప్పుడు థియేటర్ల లెక్కలు, షోల టైమింగ్స్ పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ విషయానికొస్తే.. ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు. సింగిల్ స్క్రీన్లలో ఎలాగూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేస్తారు. కాబట్టి ఉదయం షో కాస్త ముందుగా మొదలుపెట్టి, గ్యాప్స్ అడ్జస్ట్ చేసుకుని ఆ నాలుగు ఆటలు పడేలా ఈజీగా ప్లాన్ చేసుకుంటారు.
కానీ అసలు చిక్కంతా మల్టీప్లెక్స్‌లతోనే వస్తుంది. మల్టీప్లెక్స్‌లలో టైమ్ లిమిట్స్ ఉండవు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11:15 షో వరకు వాళ్ల కన్వీనియన్స్ బట్టి షోలు రన్ చేసుకుంటారు. సాధారణంగా రెండున్నర గంటల సినిమా అయితే ఒక స్క్రీన్‌లో రోజుకు 5 నుంచి 6 షోల వరకు వేసుకునే వీలుంటుంది. కానీ ‘ధురంధర్ 2’ నాలుగు గంటల సినిమా కావడం, దానికి తోడు ఇంటర్వెల్ బ్రేక్, షో పూర్తయ్యాక క్లీనింగ్.. ఇవన్నీ కలుపుకుంటే ఒక షో సైకిల్‌కు కనీసం నాలుగున్నర గంటల సమయం పడుతుంది. దీనివల్ల మల్టీప్లెక్స్‌లలో కచ్చితంగా షోల సంఖ్య తగ్గుతుంది. అలా షోలు తగ్గడం వల్ల డైలీ గ్రాస్‌పై నేరుగా ఎఫెక్ట్ పడుతుంది.
అయితే, ట్రేడ్ విశ్లేషకులు మాత్రం మరో పాయింట్ చెబుతున్నారు. ‘ధురంధర్ 2’ లాంటి భారీ అంచనాలున్న సినిమాకు ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ వస్తే.. రన్ టైమ్ అస్సలు మ్యాటర్ కాదు. బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే.. మెట్రో సిటీల్లోని ప్రీమియం మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు ₹2500 రేంజ్‌లో ఉన్నా జనాలు ఎగబడి కొంటున్నారు. షోలు తగ్గినా, ఈ రేంజ్ టికెట్ ధరలతో అన్ని షోలకు 100% ఆక్యుపెన్సీ వస్తే ఆ కలెక్షన్ల లోటు ఈజీగా కవర్ అయిపోతుంది.
మరోవైపు, డైరెక్టర్ ఆదిత్య ధర్ వ్యూహం వేరేలా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి భారీ క్యాస్టింగ్ ఉంది. సీక్వెల్ కాబట్టి ప్రతి క్యారెక్టర్ డెప్త్‌ను మరింత డీటెయిల్‌గా చూపించడానికి, యాక్షన్ ఎపిసోడ్స్‌కు సరైన స్పేస్ ఇవ్వడానికే ఆయన ఏకంగా నాలుగు గంటల సమయం తీసుకున్నారని తెలుస్తోంది. రీసెంట్ హిస్టరీ చూస్తే.. ధురంధర్ పార్ట్ 1, అనిమల్, పుష్ప 2 లాంటి సినిమాలు రన్ టైమ్ ఎక్కువ ఉన్నా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఎంగేజింగ్ కంటెంట్ ఉంటే జనాలు వాచీలు చూడరని ఇప్పటికే ప్రూవ్ అయింది.
మొత్తానికి ‘ధురంధర్ 2’ కేవలం సినిమా కాదు, ఒక ఎక్స్‌పీరియన్స్ అని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. మొదటి ఆట పడేసరికి ఆడియన్స్‌కు ఎమోషన్ కనెక్ట్ అయితే.. ఈ టైమ్ అనేది ఏమాత్రం అడ్డంకి కాదు. కానీ ఏమాత్రం తేడా కొట్టినా, విమర్శలకు అదే పెద్ద ఆయుధంగా మారుతుంది. స్క్రీన్ మీద రణవీర్ సింగ్ మ్యాజిక్ ఆ నాలుగు గంటల పాటు ఎలా కట్టిపడేస్తుందో చూడాలి.
