ఇదీ ‘ఓకే బంగారం’ టైటిల్ కథ..!

Dil-Raju-manirathnam
విభిన్న, విలక్షణ, భావోద్వేగపూరిత సినిమాల ద్వారా దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా నిలిచారు.. మణిరత్నం. ఆయన సినిమాలన్నీ కొత్తగా దర్శకులవ్వాలనుకునే వారికి పాఠాలవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడు గత కొంతకాలం నుంచి తనదైన ముద్ర వేసే సినిమా చేయలేకపోయారు. ఇప్పుడు తాజాగా ‘మణిరత్నం ఇస్ బ్యాక్’ అన్న స్లోగన్ వినపడుతున్న నేపథ్యంలో వస్తోన్న చిత్రం.. ఓకే కన్మణి. తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

సాధారణంగా తన సినిమాల్లో ప్రతీ విషయం, పాత్రా సినిమాకి అర్థాన్ని తెచ్చిపెట్టాలని తపిస్తుంటారు మణిరత్నం. ఆయన సినిమా పేర్లన్నీ కూడా పవర్ఫుల్‌గా ఉండడమే కాక, బలమైన కథకు మరింత బలాన్ని పేరు ద్వారానే చేకూరుస్తుంటాయి. ఓకే కన్మణి విషయంలోనూ ఆ జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తోంది. దీన్ని తెలుగులో ‘ఓకే బంగారం’గా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తోన్న దిల్‌రాజు.. కన్మణి అంటే ఏమిటని మణిరత్నంని అడగ్గా, ప్రియమైన అని అర్థం వస్తుందని తెలిపారట. ఆ వెంటనే దిల్‌రాజు, అయితే తెలుగులో ఓకే బంగారం అని పేరు పెడదాం అనడం, మణిరత్నం కూడా ఇంప్రెసై ఓకే చేయడం చకచకా జరిగాయట. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది.

Exit mobile version