ఎన్టీఆర్ వన్ మోర్ అడిగే ఛాన్స్ ఇవ్వలేదంటున్న బాబీ !


దర్శకుడు బాబీ, ఎన్టీఆర్ ల కలయికలో రూపొందుతున్న ‘జై లవ కుశ’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎంతటి స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటం, విడుదలైన ఫస్ట్ లుక్స్ అద్భుతంగా ఉండటంతో సినిమా విజయంపై అభిమానుల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. ఇక నిన్న తారక్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బాబీ ఎన్టీఆర్ తో వర్క్ చేయడం ఒక గొప్ప అనుభవమని అంటున్నారు.

అంతేగాక షూటింగ్ సమయంలో ఒక్కసారైనా వన్ మోర్ అడుగుదామని చాలా ట్రై చేశానని, కానీ ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వలేదని, షాట్ పూర్తై మానిటర్ వైపు చూసుకునేలోపు ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోతారని, అన్నింటి మీదా మంచి కమాండ్ ఉన్న నటుడు. ఆయనతో పనిచేయడం గొప్ప అఛీవ్మెంట్. ఆయన గొప్ప డ్యాన్సర్ మాత్రమే కాదు గొప్ప పెర్ఫార్మర్ కూడా అని అన్నారు. తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.