ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమానే కాదు భక్తికి ప్రతీక – దర్శకుడు ఓం రౌత్

Published on Oct 2, 2022 11:33 pm IST

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భూషణ్ కుమార్, ఓం రౌత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగ స్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.

ఆదివారం సరయూ నది తీరాన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆదిపురుష్ భారీ పోస్టర్ రిలీజ్ చేశారు. చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది టీజర్ లో అద్భుతంగా చూపించారు.

టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ, “పవిత్ర అయోధ్య నగరంలో ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేడుక జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి నేను ఒక శ్రీరామ భక్తుడిగా వచ్చాను. ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమానే కాదు భక్తికి ప్రతీక. మా అందరి ఇష్టంతో ఇదొక మిషన్ లా భావించి పనిచేశాం. టీజర్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే ప్రేమను మాపై చూపించండి” అని అన్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :