
చాలా రోజుల తర్వాత హీరో శివాజీకి ఓ చక్కని విజయం అందిచిన సినిమా ‘బూచమ్మ బూచోడు’. కైనాజ్ మోతివాలా హీరోయిన్. హారర్ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. కలెక్షన్స్ కూడా బాగున్నాయి. అయితే సక్సెస్ క్రిడిట్ తనకు రానివ్వకుండా హీరో శివాజీ అడ్డుకుంటున్నారు అంటూ దర్శకుడు రేవన్ యాదు(యాదగిరి) విమర్శలు చేస్తున్నారు.
సినిమా విజయవంతం అయిన సందర్భంగా మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న శివాజీ ఒక్కసారి కూడా తనను ఆహ్వానించలేదని దర్శకుడు రేవన్ యాదు ఆరోపిస్తున్నారు. ఇంకా మాట్లాడుతూ… ‘బూచమ్మ బూచోడు’ సినిమా కోసం నేను 18 నెలలు కష్టపడ్డాను. నిర్మాతలు చెప్పిన బడ్జెట్ లో సినిమా తీశాను. సినిమా విడుదల అయిన తర్వాత నన్ను పక్కన పెట్టేశారు. పట్టించుకోవడం లేదు. సినిమా విజయానికి అంతా తానె కారణం అంటూ శివాజీ ఇంటర్వ్యూలలో చెప్తున్నారు. ఎం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో నేను మీడియా ముందుకు వచ్చాను అంటూ సాక్షి ఛానల్ లైవ్ లో చెప్పారు దర్శకుడు రేవన్ యాదు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన సంతోషం నాకు లేకుండా చేస్తున్నారు. నా టాలెంట్ గురించి ప్రేక్షకులకు తెలియనివ్వడం లేదు అంటూ రేవన్ యాదు హీరో నిర్మాతలపై ఆరోపణలు చేశారు.
నేను ప్రతి ఇంటర్వ్యూలలో దర్శకుడి గురించి గొప్పగా చెప్తున్నాను. మీడియా హీరో హీరోయిన్లకు ఇచ్చిన ప్రాముఖ్యత దర్శకులకు, టెక్నీషియన్లకు ఇవ్వడం లేదు. కేవలం మీడియా పిలిస్తే నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను, నేను దర్శకుడిని పక్కన పెట్టడం లేదని హీరో శివాజీ రిప్లై ఇచ్చారు.