కొత్త పాటను రికార్డ్ చేసుకున్న డీజే టీమ్ !


అల్లు అర్జున్ – హరీష్ శంకర్ ల కలయికలో రూపొందిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం విడుదలకు ముందే పలు అంశాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. వాటిలో ‘గుడిలో ఒడిలో బడిలో’ పాట వివాదం కూడా ఒకటి. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఈ పాట అభిమానులకు ఎంతగా నచ్చిందో బ్రాహ్మణ సంఘాలకి అంతంగా కోపం తెప్పించింది. ఆ పాటలో పవిత్రమైన శివుని స్తోత్రాన్ని అవమానించారని, వెంటనే ఆ పాట నుండి ‘నమకం చమకం’ వంటి అభ్యంతరకమైన పదాలను తొలగించాలని డిమాండ్ చేశాయి.

అందుకు దర్శకుడు హరీష్ మొదట ఒప్పుకోకపోయినా చర్చల అనంతరం పదాలను మార్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు ‘నమకం చమకం’ అనే పదాల స్థానంలో ‘నా గమకం నీ సుముఖం’ వంటి పదాలను భర్తీ చేసి పాటను కొత్తగా రికార్డ్ చేశారట. దీంతో ఈ పాట వివాదానికి తెరపడినట్లైంది. బన్నీ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్న ఈ చిత్రాన్ని జూన్ 23న భారీ ఎత్తున విడుదలచేయనున్నారు.