శ్రీ అమ్మ భగవాన్ బోధనలతో “ఏదైనా సాధ్యమే” చిత్ర టైటిల్ ఆవిష్కరణ

హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో “ఏదైనా సాధ్యమే” (దైవం తోడుంటే..) చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై అనిల్ మునగనూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మద్దూరి రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్యాత్మికత, మానవ సంబంధాల కలయికగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

శ్రీ అమ్మ భగవాన్ బోధనల స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మనిషి తన ఇష్ట దైవంతో అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా కష్టాల నుంచి ఎలా విముక్తి పొందవచ్చో ఇందులో చూపించనున్నారు. ‘నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, నీ ఆంతరంగిక ప్రపంచమే బాహ్య ప్రపంచం, వ్యక్తి లేడు-వ్యక్తిత్వాలే ఉంటాయి, అంతర్గత సత్యం, జీవితమంటేనే బాంధవ్యాలు’ అనే ఐదు ప్రధాన సూత్రాల చుట్టూ సినిమా కథనం సాగుతుందని చిత్ర బృందం తెలిపింది.

ప్రస్తుత సమాజంలో నిరాశ, డిప్రెషన్‌తో బాధపడుతున్న యువతకు దైవంతో ఉండే బంధం ఎలా అద్భుతాలు చేస్తుందో ఈ సినిమా ద్వారా సందేశం ఇవ్వనున్నట్లు నిర్మాత అనిల్ మునగనూరి పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆయన కథ, మాటలు, సాహిత్యం కూడా అందిస్తున్నారు. ఎన్. సుబ్రహ్మణ్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, రమేష్ సినిమాటోగ్రాఫర్‌గా, ఫణీంద్ర ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Exit mobile version