ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: రితు వర్మ – అందరూ మంచి నటి అంటుంటే చాలా బాగుంది


‘పెళ్లి చూపులు’ చిత్ర విజయంతో మంచి గుర్తింపుతో పాటు వసరుస సినిమా వకాశాలను దక్కించుకుంటున్న యంగ్ హీరోయిన్ రితు వర్మ తాజాగా నిఖిల్ తో కలిసి ‘కేశవ’ సినిమాలో నటించారు. ఈ నెల 19వ తేదీన సినిమా రిలీజవుతున్న సందర్బంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘పెళ్లి చూపులు’ తర్వాత మీకు ఎలాంటి స్పందన లభించింది ?
జ) ఆ సినిమా తర్వాత అందరు నన్ను మంచి పెర్ఫార్మర్ అంటున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమాలో నా నటనను చూసే విక్రమ్ గారి చిత్రం, కేశవాల్లో అవకాశాలొచ్చాయి.

ప్ర) ‘పెళ్లి చూపులు’ తర్వాత అంత లాంగ్ గ్యాప్ ఎందుకొచ్చింది ?
జ) కొంచెం సెలెక్టెడ్ గా సినిమాలు ఎంచుకోవడంతో ఆ గ్యాప్ వచ్చింది. పెళ్లి చూపులు తర్వాత నా కెరీర్ గ్రాఫ్ పెరిగింది. కేవలం సినిమాలు చేయాలి అనే ఉద్దేశ్యంతో కాకుండా మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. అందుకే గ్యాప్ వస్తోంది.

ప్ర) ఇలాంటి టైమ్ లో ఇలా సెలెక్టివ్ గా సినిమాలు చేయడం రిస్క్ అనిపించడంలేదా ?
జ) లేదు. ఒకసారి ఒక సినిమా మాత్రమే చేస్తుండటం వలన మంచి నటనకు స్కోప్ ఉన్న సినిమాల్ని ఎంచుకోవడాని టైమ్ ఉంటుంది. మనం పనిచేసే విధానమే మాట్లాడుతుందని నేననుకుంటున్నాను.

ప్ర) మిమ్మల్ని పూర్తి గ్లామరస్ రోల్స్ లో ఎప్పుడు చూస్తాం ?
జ) చూడొచ్చు. గ్లామరస్ పాత్రల్ని, నటనకు ఆస్కారమున్న పాత్రల్ని ఒకేలా బ్యాలన్స్ చేస్తూ సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను.

ప్ర) ఈ ‘కేశవ’ సినిమా అవకాశం ఎలా వచ్చింది ?
జ) పెళ్లి చూపులు సినిమా చూసి డైరెక్టర్ సుధీర్ వర్మ నాకీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే చాలా డిఫరెంట్ గా అనిపించింది. నిఖిల్ ఫిజికల్ కండిషన్, దాని చుట్టూ సుధీర్ వర్మ రాసుకున్న కథనం చాలా బాగున్నాయి. అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నాను.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నేనొక లా స్టూడెంట్ గా కనిపిస్తాను. హీరో నిఖిల్ కు ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండే పాత్ర. సినిమా మొత్తం చాలా సీరియస్ గా సాగుతుంది. అందుకే ఇందులో ప్రత్యేకంగా పాటలు, డ్యాన్సులు లాంటివేమీ ఉండవు.

ప్ర) ఈ సినిమాలో అన్నిటికన్నా స్పెషల్ ఏంటి ?
జ) ఇదొక రివెంజ్ డ్రామా. డైరెక్టర్ మంచి కథాన్ని తయారుచేశారు. ఇందులో ఇంటెన్సిటీతో కూడిన మంచి ఎమోషన్ డ్రామా ఉంటుంది.

ప్ర) విక్రమ్ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది ?
జ) పెళ్లి చూపులు తర్వాత గౌతమ్ మీనన్ గారి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. వెంటనే చెన్నై వెళ్లి కలిశాను. మొదట ఒక లుక్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఇంకోటి చేశారు. ఆ రెండు బాగుండటంతో గౌతమ్ మీనన్ గారు నాకీ రోల్ ఆఫర్ చేశారు.

ప్ర) విక్రమ్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
జ) నేనిప్పటికీ విక్రమ్ గారి సినిమా చేస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. మొదటిరోజు వెళ్లి ఆయన్ను కలిశాను. ఆయన సింప్లిసిటీ చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభవం.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) తెలుగు, తమిళంలలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాను.