ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : సుధీర్ వర్మ – త్రివిక్రమ్, సుకుమార్ ల కాంప్లిమెంట్స్ ను ఎప్పటికీ మర్చిపోలేను !


నిఖిల్ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించిన చిత్రం ‘కేశవ’ బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచి మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్బంగా మేము సుధీర్ వర్మతో ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) రెండవ వారంలో సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) సినిమా పాజిటివ్ టాక్ తో మొదలవడం మూలాన మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ప్రమోషనల్ టూర్లకు కూడా వెళుతున్నాం. రెస్పాన్స్ చాలా బాగుంది. వైజాగ్లో పక్కపక్కనే ఉన్న నాలుగు స్క్రీన్లలో ఆడుతున్న సినిమా ప్రతి షో హౌస్ ఫుల్ అవుతోంది. ఏ సెంటర్ ఆడియన్స్ సినిమాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.

ప్ర) మరి బి, సి సెంటర్ల ప్రేక్షకుల సంగతేంటి ?
జ) నిజం చెప్పాలంటే బి, సి సెంటర్లలో సినిమా కొంచెం నెమ్మదిగానే ఉంది. మేము మొదటిరోజు నుండి సీరియస్, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే ఏ సెంటర్ ప్రేక్షకుల్నే టార్గెట్ చేసి పనిచేశాం.

ప్ర) మొదటిరోజు సినిమాకి మిశ్రమ స్పందన ఎందుకొచ్చింది ?
జ) ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్ వలన ఎక్కువ అంచనాలు పెట్టుకున్నవారు కొంచెం నిరుత్సాపడ్డారు. అలా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ టాక్ విని నెగెటివ్ ఒపీనియన్ తో థియేటర్లోకి వెళ్లిన చాలా మందికి సినిమా నచ్చింది. అది కూడా మాకు ఉపయోగపడింది.

ప్ర) సినిమాలో నిఖిల్ గుండె వ్యాధిని ఎక్కువగా ఎందుకు వాడలేదు ?
జ) అవును. స్క్రిప్ట్ రాసుకునేప్పుడు నిఖిల్ పాత్రకు అదొక అదనపు అంశంగానే రాసుకున్నా. దాన్ని రాజా రవీంద్రను చంపేటప్పుడు మాత్రమే చూపించాను. ఆ తర్వాత కూడా ఆ పాయింట్ మీదే సినిమా నడుస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అదంతా ముఖ్యమైన అంశం కాదు.

ప్ర) బిజినెస్ పరంగా సినిమా ఎంత వరకు సేఫ్ అయింది ?
జ) సినిమాను రూ. 6.5 కోట్ల బడ్జెట్ తో చేశాం. రిలీజుకు ముందే నిర్మాతలకి టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేశాయి. ఇప్పుడొచ్చేదంతా ఆదాయమే.

ప్ర) నిఖిల్ పెర్ఫారెన్స్ గురించి చెప్పండి ?
జ) ముందుగానే చెప్పినట్టు సినిమా రిలీజ్ తరవాత నటన పరంగా నిఖిల్ కు చాలా క్రెడిట్ దక్కింది. ఎక్కువ శాతం అతని పెర్ఫార్మెన్స్ వలన, కెమెరా వర్క్ వలన, నా స్క్రీన్ ప్లే వలన సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది.

ప్ర) పరిశ్రమ నుండి మీకందిన బెస్ట్ కాంప్లిమెంట్ ?
జ) త్రివిక్రమ్ గారు సినిమా చూసి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా సినిమాలో ఏది చూపించాలో అదే చూపించావని మెచ్చుకున్నారు. ముందే కథ తెలిసిన సుకుమార్ గారు కూడా సినిమా చూసి ఊహించిన దానికంటే ఇంకా బెటర్ గా సినిమా తీశావ్ అన్నారు. ఆ కాంప్లిమెంట్స్ నాకెప్పటికీ గుర్తుండిపోతాయి.

ప్ర) కేశవ సక్సెస్ మీకెలా ఉపయోగపడబోతోంది ?
జ) ఈ సక్సెస్ నాకు చాలా కానిఫిడెన్స్ ను ఇచ్చింది. మంచి స్క్రీన్ ప్లే ఉండే భిన్నమైన సినిమాల్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని గట్టి నమ్మకమొచ్చింది.

ప్ర) మీ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటి ?
జ) అంతా అనుకున్నట్టే జరిగితే శర్వానంద్ తో ఆగష్టులో సినిమా మొదలుపెడతాను.