
‘గంగ పుత్రులు’, ‘సొంత ఊరు’ వంటి చిత్రాల ద్వారా విమర్శకుల ప్రశంసలనూ, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ వంటి చిత్రాల ద్వారా బాక్సాఫీస్ విజయాలనూ సొంతం చేసుకున్న దర్శకుడు పీ. సునీల్ కుమార్ రెడ్డి తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి, మహేష్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రేపు (ఏప్రిల్ 3) విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…
ప్రశ్న) ‘మిస్ లీలావతి’ ఏం చెప్పబోతోంది?
స) నా ప్రతీ సినిమా సామాజిక అంశం నేపథ్యంలోనే నడుస్తుంది. ఈ సినిమాలో అక్రమ సంబంధాలు సమాజంలో క్రైమ్‌కు ఎలా దారితీస్తాయన్న బోల్డ్ కాన్సెప్ట్‌ను డీల్ చేశాం. దీనికి హుదూద్ తుఫాను నేపథ్యాన్ని జోడించి మనిషికి, ప్రకృతి విధ్వాంసానికి మధ్య గల సంబంధాన్ని చూపించాం. హుదూద్ ద్వారా దెబ్బతిన్న ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం.
ప్రశ్న) ప్రతీ సినిమాలో సోషల్ మెసేజ్‌కు చోటిస్తారు కదా? ఈ సినిమాలో ఏం మెసేజ్ ఇచ్చారు?
స) నా గత సినిమాల్లానే ఈ సినిమాలోనూ మంచి మెసేజ్ ఉంది. ‘చట్టబద్ధమైన హెచ్చరిక : అక్రమ సంబంధాలు కుటుంబానికి హానికరం’ అన్న ట్యాగ్‌లైనే సినిమా మెసేజ్. ఆ విషయం చుట్టూనే కథ నడుస్తుంది. అయితే సోషల్ మెసేజ్‌ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా కమర్షియల్ ఫార్మాట్లో చెప్పడం ఈ సినిమా ప్రత్యేకత.
ప్రశ్న) సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టున్నారు?
స) బోల్డ్‌గా ఒక విషయాన్ని చెప్పినపుడు సాధారణంగానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ సినిమా మన ముందుంచే కొన్ని ప్రశ్నలు సమాజంలో చెప్పకూడనివిగా ఉన్నందువల్ల సెన్సార్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే. కొన్ని కట్స్ చెప్పిన తర్వాత ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేశారు.
ప్రశ్న) ‘మిస్ లీలావతి’ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
స) ఈ సినిమాలో మిస్ లీలావతి అనే క్యారెక్టర్ సృష్టించే సమస్యలు, అక్కణ్ణుంచి జరిగే ప్రయాణమే సినిమాగా చెప్పుకోవచ్చు. అన్ని విధాలా క్యారెక్టర్ పేరునే సినిమాకు పెడితే బాగుంటుందని ఆ పేరు పెట్టాం.
ప్రశ్న) అంతా కొత్తవాళ్ళతోనే తీశారెందుకని?
స) ఈ కథను కొత్త వాళ్ళైతేనే జస్టిఫై చేయగలరనే ఉద్దేశంతో కొత్తవాళ్ళతో తీశాం. అందరూ బాగా చేశారు. లీలావతి పాత్రకు ముంబై భామను ఎంచుకున్నాం. ఆమె స్క్రీన్ నేమ్ కూడా లీలావతి అనే పెట్టాం.
ప్రశ్న) మీ నుంచి మాస్ సినిమాలేవైనా ఆశించొచ్చా?
స) నేను ఎప్పుడైనా ఇష్యూ బేస్డ్ కథలనే ఎంచుకుంటా. ముందొక ఇష్యూని ఎంచుకొని దాని చుట్టూ కథను అల్లుతా. పనిగట్టుకొని ఇలాంటి సినిమాయే తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. సమాజంలో జరిగే ఇష్యూలే.. నా సినిమా కథలు.
ప్రశ్న) ఈ సినిమాలో మేజర్ హైలైట్స్ ఏంటి?
స) ఈ సినిమా ఇచ్చే మెసేజ్‌నే మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఒక సామాజిక అంశాన్ని కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించడం ఈ సినిమాకు బాగా కలిసివచ్చే అంశం. హుదూద్ నేపథ్యంలో తెరకెక్కిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ప్రశ్న) తదుపరి సినిమాలేంటీ?
స) ఈనెల 15న ఒక సినిమాను మొదలుపెడుతున్నా. అదికూడా సామాజిక సమస్యలను ఎత్తి చూపేదే. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాలు త్వరలోనే తెలియజేస్తా.
ప్రశ్న) చివరగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
స) యువతరం మాత్రమే కాక, కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్క జంటా తప్పక చూడాల్సిన సినిమా మిస్ లీలావతి. ‘మిస్ లీలావతి’ని మిస్ కావొద్దు!
ఇక అక్కడితో దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డితో మా ఇంటర్వ్యూ ముగించాం. మిస్ లీలావతి రేపు విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌కి 123తెలుగు తరపున శుభాకాంక్షలు.